Woman vanished in RK Beach is found: ఏపీ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వివాహిత చిరిగిడి సాయి ప్రియ వ్యవహారంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. విశాఖ సముద్ర తీరంలో అదృశ్యమైన సాయిప్రియ.. నెల్లూరులో ప్రత్యక్షమైంది. అది కూడా ఓ యువకుడితో ఉండగా.. పోలీసులు గుర్తించారు. తన భార్య సముద్రంలో కొట్టుకుపోయిందంటూ రెండురోజుల క్రితం సాయి ప్రియ భర్త శ్రీనివాసరావు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైనట్లు భావించిన పోలీసులు.. సముద్రంలో జల్లెడ పట్టారు.
రెండు రోజులుగా స్పీడ్ బోట్ల సాయంతో సముద్రంలో.. హెలికాప్టర్ ద్వారా పైనుంచి గాలింపు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో అసలు సాయి ప్రియ గల్లంతయ్యిందా? ఇంకేదైనా జరిగిందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆమె నెల్లూరులో ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భార్యభర్తల మధ్య కొన్ని వివాదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ యువకుడితో నెల్లూరు వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విశాఖ పోలీసులు సాయంత్రం వెల్లడించే అవకాశముంది.
"రెండో వివాహవార్షికోత్సవం సందర్భంగా సాయిప్రియ దంపతులు.. సింహాచలం వెళ్లి.. అటునుంచి విశాఖ ఆర్కే బీచ్‌కు వెళ్లారు. అక్కడ సాయి ప్రియ సముద్రంలో కొట్టుకుపోయిందని ఆమె భర్త శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు, నేవీ, కోస్ట్‌గార్డ్స్ అందరం.. అన్ని రకాలుగా సముద్రంలో వెతికాం. ఇవాళ ఆమె నెల్లూరులో ఓ యువకుడితో ఉన్నట్టు సమాచారం వచ్చింది. వాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కానీ.. మనకు ఇంకా రాలేదు. పూర్తి వివరాలు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది." - శ్రీధర్, విశాఖ డిప్యూటీ మేయర్
అసలేం జరిగిందంటే..
చిరిగిడి సాయిప్రియ, శ్రీనివాసరావు భార్యాభర్తలు. సాయి ప్రియ విశాఖ ఎన్‌ఏడీ సమీపంలోని సంజీవయ్యనగర్‌లో ఉంటుండగా.. భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం పెళ్లిరోజు కావడంతో అదే రోజు సాయంత్రం భార్యాభర్తలు ఆర్కేబీచ్‌కు వెళ్లారు. రాత్రి 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోదామని అనుకుంటుండగా.. శ్రీనివాసరావుకు ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోపు భార్య కనిపించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు.. మంగళవారం ఉదయం నుంచి స్పీడ్‌బోట్లు, నేవీ హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె ఆచూకీ నెల్లూరులో లభించడం గమనార్హం.