విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలను జరపాలంటూ పలు దేవాలయాలకు ఏపీ దేవాదాయశాఖ మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18న ఆయన జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో శారదాపీఠం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘స్వరూపానందేంద్ర జన్మదినం సందర్భంగా భగవంతుని ఆశీస్సులు కోసమే ఆలయ మర్యాదలు కోరాం. 2004 నుంచి ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని కోరుతూ లేఖ రాశాం. దీనిపై అసత్య ప్రచారాలు, రాద్ధాంతాలు చేయడం సరికాదు.
ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తప్పకుండా స్వీకరిస్తాం’’ అని శారదాపీఠం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు దేవాదాయ శాఖ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ లలిత్ కుమార్ అనే వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆలయ మర్యాదలు కోరుతూ రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు శారదాపీఠం హైకోర్టుకు తెలియజేయడంతో ఈ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు అయింది.
ఇదీ చదవండి: 'దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్'