వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఏపీ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ... ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీపీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. తాజాగా జరిగిన విచారణలో ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది సుమన్ స్పందిస్తూ.. ఎస్ఈసీ వేసిన కౌంటర్కి తిరుగు సమాధానంగా.. కౌంటర్ వేస్తామని చెప్పారు. కరోనా టీకా కార్యక్రమానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన నిబంధనలకు ఎస్ఈసీ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడటంలేదని అన్నారు. వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరుస్తామని చెప్పారు.