ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల 10 నెలల పాటు జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జన సమర్థ ప్రాంతాల్లోకు వెళ్లాలంటేనే ప్రజలంతా భయపడ్డారు. ఇంటి నుంచే పని వల్ల పెద్దలు, అంతర్జాల తరగతులతో పిల్లలు నాలుగు గోడల మధ్య గడిపారు. కొవిడ్‌కు టీకా రావడం, వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే భాగ్య నగర వాసులు స్వేచ్ఛగా గడపదాటుతున్నారు. మునుపటిలా ఇంటిల్లిపాది ఉద్యానవనాలకు తరలిస్తున్నారు.
క్రమంగా ఉద్యానవనాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. లుంబిని, ఎన్టీఆర్, సంజీవయ్య పార్కుల్లోకి ప్రజలు పోటెత్తుతున్నారు. మూడు పార్కుల్లో కలిసి 2019 అక్టోబర్‌లో 3 లక్షల 48 వేలు వస్తే 2020 అక్టోబర్‌లో 58 వేలు మాత్రమే వచ్చారు. జనవరిలో మాత్రం ఆ గణంకాలు రెట్టింపయ్యాయి. 2021 జనవరిలో మూడు పార్కులను మొత్తం 3 లక్షల 34 వేల మంది చుట్టేశారు. సాధారణ రోజుల్లో కంటే సెలవు దినాలు, వారాంతాల్లో అధిక సంఖ్యలో జనం వస్తున్నారు. రోజుకు సగటున 3 వేల మంది ఉద్యానాలను సందర్శిస్తున్నారు. పనిఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేలా హుసేన్‌సాగర్‌లో బోటింగ్ చేస్తూ గంగమ్మ ఒడిలో విహరిస్తున్నారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. శానిటైజర్‌ను అందుబాటులో ఉంచారు. చాన్నాళ్ల తర్వాత విహార యాత్రలు మొదలవడం పట్ల చిన్నారులు ఆనందడోలికల్లో ఊగిపోతున్నారు.