నెలల తరబడి ఇళ్లలోనే గడుపుతున్న నగర ప్రజలకు సేదతీరేందుకు అవకాశం లేకుండా పోయింది. తాజాగా రాష్ట్రంలోని జూపార్కులు, జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఆదివారం నుంచి హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కూడా తిరిగి తెరచుకోనుంది. ఉదయం 8.30గంటలకు జూ పార్క్‌ను పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సందర్శనకు వచ్చే వారికి పలు మార్గదర్శకాలను జూ అధికారులు విడుదల చేశారు.
సందర్శకులకు మార్గదర్శకాలు
ప్రవేశం ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ కచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. టికెట్ కౌంటర్ వద్ద భౌతిక దూరం పాటించేలా వృత్తాలు ఏర్పాటు చేశారు. జలుబు లేదా జ్వరం ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని పేర్కొన్నారు. పది సంవత్సరాల లోపు చిన్నారులతో పాటు 65 సంవత్సరాల పైబడ్డ వృద్ధులు ఆదివారాలు, సెలవు దినాలలో జూ సందర్శనకు రాకపోవడం మంచిదని అధికారులు సూచించారు. జంతు ప్రదర్శన శాలలో సఫారీ పార్క్, సర్పాల గృహము, అక్వేరియం, ఫాజిల్ మ్యూజియం, నాచురల్ హిస్టరీ మ్యూజియం మూసి ఉంటాయని వెల్లడించారు. ప్రవేశ ద్వారం వద్ద రసాయన మ్యాట్లను ఏర్పాటు చేశామన్నారు.
మాస్క్ తప్పనిసరి
జూ పార్క్‌లోకి ప్రవేశించినప్పటినుంచి తిరిగి వెళ్లే వరకు మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని.. లేనిపక్షంలో రూ.200 జరిమానా విధిస్తామన్నారు. జూ పార్క్‌లో అందుబాటులో ఉండే బ్యాటరీ వాహనాలలో భౌతిక దూరాన్ని దృష్టిలో ఉంచుకొని 50 శాతం సీటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సందర్శకుల కోసం అక్కడక్కడ శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ఒక వేళ జూ అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించని యెడల సందర్శకులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సందర్శకుల కోసం జూ పార్క్‌లో ప్రతి రోజూ రెండు సార్లు శానిటైజర్ పిచికారి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. జూ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉమ్మివేయడం నేరమని.. అతిక్రమిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: Matsya Setu App : మత్స్యసంపద పెంపునకు ఆన్లైన్ కోర్సులు