Marriages with tribal tradition: ‘నా వివాహాన్ని విభిన్నంగా, చిరకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నా. కానీ... ఆ కోరిక నెరవేర్చుకోలేకపోయా’ అంటూ బాధపడే వారిని విశాఖ జిల్లా పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోని గిరిగ్రామదర్శిని నేనున్నానంటూ ఆహ్వానిస్తోంది. వినూత్నంగా, విభిన్నంగా వివాహాన్ని చేసుకోవాలనుకునే వారి ఆశలనూ తీరుస్తానంటూ రారమ్మంటోంది. అరకులోయ సమీపంలోని పెదలబుడు గిరి గ్రామదర్శినిలో పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన ఆచార, సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని చేస్తున్నారు. కొత్తగా వివాహం చేసుకునే వారితోపాటు మళ్లీ వివాహ తతంగాన్ని ఆస్వాదించాలనుకునే దంపతులకు ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. గిరిజన యువతీ, యువకుల మాదిరిగా కట్టు బొట్టు.. అప్పగింతలు.. విందు వరకు ఇక్కడ వివాహ క్రతువును నిర్వహిస్తారు. గిరి గ్రామాల్లోని వధూవరులను ఏవిధంగా తయారు చేస్తారో అదేవిధంగా గిరి ఆభరణాలు, దుస్తులతో వధూవరులను పెళ్లికి సిద్ధం చేస్తారు. మండపం, బాజాభజంత్రీలతో సందడి చేస్తారు. గిరిజన పూజారి పఠించే మంత్రోచ్ఛారణల మధ్య వేడుకను గిరిజన ఆచారాల ప్రకారం పూర్తి చేస్తారు. పెండ్లికి వచ్చిన అతిథులకు విందు ఇస్తారు. థింసాతో ఇక్కడ ఫైర్‌క్యాంపు సదుపాయాన్ని కల్పిస్తారు. అరకులోయను సందర్శించే పర్యటకులు ఈ కొత్త వివాహ వేడుకను తామూ జరిపించుకోవాలని ముచ్చట పడుతున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన శేఖర్‌బాబు మాట్లాడుతూ... ‘నా పెళ్లిని ఆదరాబాదరాగా చేసుకున్నా. ఇప్పుడు మేం మళ్లీ కొత్తగా పెళ్లి చేసుకున్న అనుభూతి కలిగింది. గిరిజన ఆచార, సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరిగిన వేడుక ఆనందాన్ని ఇచ్చింది. ఇది జీవితాంతం గుర్తుండిపోతుంది’ అని సంతోషం వ్యక్తం చేశారు. మీరు కూడా గిరిజన సంప్రదాయాలతో వివాహ వేడుకని ఆస్వాదించాలనుకుంటే... వివాహ వేడుకకు రూ.8వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రోగ్రాం మేనేజరు గణపతి నాయుడు (94936 32629), ఇన్‌ఛార్జి మురళీకృష్ణలను (94900 47109) సంప్రదిస్తే సరిపోతుంది.
ఇదీ చదవండి: TSRTC New Offer : పుస్తక ప్రియులకు తెలంగాణ ఆర్టీసీ ఆఫర్