ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 18న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ ప్రకటించింది. దిల్లీలో మీడియాతో కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఉక్కు ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకే దిల్లీకి వచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. కార్మిక సంఘాలు చేస్తున్న కృషికి అన్ని పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయని గుర్తు చేశారు. చాలా కాలంగా గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామని.. కానీ ఇంతవరకు కేటాయించలేదని విమర్శించారు. భారత సంప్రదాయానికి విరుద్ధంగా జాతి సంపదను అమ్మేందుకు ప్రయత్నం చేయడం సరికాదని దుయ్యబట్టారు. వైకాపా ఎంపీలను కలిసి పార్లమెంట్లో గళమెత్తాలని కోరామని తెలిపారు. కార్మికుల గొంతు కోసే విధంగా భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలని దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు విశాఖ ఉక్కు కోసం ఏకతాటిపైకి వచ్చాయి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంపై ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. పార్లమెంట్ లోపల, బయట జాతీయ నేతల మద్దతు కోసం దిల్లీ వచ్చాం. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా కాపాడుకుంటాం. కేంద్ర కార్మిక సంఘాలతో అతిపెద్ద సభ జరుపుతాం.
- విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ
ఇవీచూడండి: 'త్వరలోనే.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు'