అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త. విద్యార్థి వీసాల స్లాట్ల సంఖ్యను ఆ దేశం భారీగా పెంచింది. వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గిపోయింది. పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రం వేచి ఉండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల వరకు వీసా స్లాట్ల కోసం సుమారు మూడేళ్ల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్‌లోని కాన్సులేట్ పరిధి నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఎదురుచూపులకు ఆ దేశం తెరదించింది. సోమవారం నుంచి భారీగా విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేసింది. ఫలితంగా స్లాట్ల కోసం వేచి ఉండే సమయం 911 రోజుల నుంచి ఒక్కసారిగా 68 రోజులకు తగ్గింది. హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో పర్యాటక వీసా కోసం వేచి ఉండే సమయం సోమవారానికి కూడా 899 రోజులుగానే ఉంది.