ఆంధ్రప్రదేశ్‌లో దుర్గగుడి ఈవోగా 2019 ఆగస్టులో సురేశ్‌బాబు నియమితులై.. 17 నెలలు కొనసాగారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక వివాదాలు ఆయన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆలయానికి చెందిన శానిటేషన్, సెక్యూరిటీ సహా ప్రధాన టెండర్ల విషయంలో పక్షపాత ధోరణి, వెండి సింహాల చోరీ, ఆలయంలోని ఉద్యోగులతో సఖ్యత లేకపోవడం, వివిధ విభాగాల్లో అవకతవకలు, పరిపాలన విభాగంపై పట్టులేకపోవడం.. వంటి అనేక వివాదాలు సురేష్‌బాబును వెంటాడాయి. ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారుల విస్తృత తనిఖీలతో సురేష్‌బాబు హయాంలో జరిగిన అవకతవకలన్నీ బయటపడ్డాయి. అప్పుడే 15మంది కిందిస్థాయి సిబ్బందిపై దేవదాయశాఖ కమిషనర్ సస్పెన్షన్ వేటు వేసినా.. ఈవోపై చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు ఈవో సురేష్‌బాబును రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా బదిలీ చేశారు.
నిబంధనలు కాలరాశారనే ఆరోపణలు..
పారిశుద్ధ్యం, సెక్యూరిటీ టెండర్లను తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టేందుకు నిబంధనలను కాలరాశారనే ఆరోపణలు ఈవో సురేష్‌బాబుపై ఉన్నాయి. 2019 దసరా ఉత్సవాల సమయంలో పారిశుద్ధ్య నిర్వహణకు పిలిచిన టెండర్‌ను అర్హత సాధించిన ఎల్1, ఎల్2కు కాకుండా తమ అనుకూలుడైన ఎల్3కి సురేశ్‌బాబు ఇచ్చారు. మరో రెండేళ్ల పాటు సదరు సంస్థను కొనసాగించేలా.. దేవదాయశాఖ కమిషనర్ అనుమతి లేకుండానే ఒప్పందం రాసి ఇచ్చేశారు. ఏడాది తర్వాత సదరు సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. కొత్తగా టెండర్లు పిలవాలంటూ కమిషనర్ ఆదేశించారు. దీంతో కొత్తగా టెండర్లు పిలిచిన సురేశ్‌బాబు.. పాత సంస్థకు రాసి ఇచ్చిన రెండేళ్ల ఒప్పందాన్ని మాత్రం రద్దు చేయలేదు. తమకు రెండేళ్లకు ఒప్పందం ఉందంటూ పాత సంస్థ న్యాయస్థానానికి వెళ్లేలా చేశారని..ఏసీబీ నివేదికలో ఎత్తి చూపించారు.
వెండి సింహాల చోరీ.. సెక్యూరిటీ సంస్థకు ఏడాది టెండర్ పొడగింపు
ఆలయ ప్రాంగణంలో ఉంచిన వెండి సింహాల చోరీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండగా ఇలాంటి సంఘటన జరగడం పూర్తిగా ఆలయ అధికారుల నిర్లక్ష్యమేనని పోలీసులు తేల్చారు. సీసీ కెమెరా ఫుటేజీ అందుబాటులో లేదు. ఈ సంఘటనకు బాధ్యులుగా ఒక్కరిపైనా చర్యలు లేవు. కాపలాగా ఉన్న సెక్యూరిటీ సంస్థదే పూర్తి బాధ్యత అని చెప్పిన ఈవో.. తిరిగి అదే సంస్థకు మళ్లీ ఏడాదికి టెండర్ కట్టబెట్టేందుకు ప్రయత్నించడం వివాదానికి దారితీసింది నిబంధనలన్నీ పాత సంస్థకే అనుకూలంగా ఉండేలా మార్చి.. వారికే మళ్లీ టెండర్ వచ్చేలా చేశారు. ఫైల్ కమిషనర్‌కు పంపించినా.. ఇంతవరకు ఆయన ఆమోదించలేదు. కానీ.. సదరు సంస్థే ఇప్పటికీ కొనసాగుతోంది.
'గాడి తప్పిన పరిపాలన విభాగం'
ఏడాదిన్నరలో ఆలయంలోని పరిపాలన విభాగం పూర్తిగా గాడి తప్పింది. ఆలయ ఆదాయానికి గండికొడుతూ పాత టిక్కెట్లను భక్తులకు విక్రయిస్తూ కొందరు అడ్డంగా దొరికిపోయారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే కొంతమంది సిబ్బంది ఇలా అడ్డదారిలో డబ్బులకు అలవాటుపడి చాలాకాలంగా టిక్కెట్ల పునర్వినియోగానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ప్రక్షాళన చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించలేదు..ఏసీబీ అధికారులు ఫిబ్రవరి నెలలో ఐదు రోజులు ఇంద్రకీలాద్రిపై తనిఖీలు చేశారు. అన్ని విభాగాల ఫైళ్లను లోతుగా పరిశీలించారు. అనేక అవకతవకలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. ఈవో సురేష్‌బాబు వైఫల్యాలను స్పష్టంగా పేర్కొన్నారు. అనేక విభాగాలకు చెందిన బిల్లులను ఎలాంటి ఆడిట్ అనుమతులు లేకుండా ఆమోదించినట్టు ఏసీబీ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏసీబీ పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నేపథ్యంలోనే దుర్గగుడి ఈవో సురేష్‌బాబుపై బదిలీ వేటు పడింది.
ఇదీ చదవండి: నగరంలో నీరు ఆకుపచ్చగా వస్తోంది!