జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారించవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నామని ఈ కేసుల్లో రెండో నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ లిమిటెడ్‌లు బుధవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశాయి. సీబీఐ కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత, లేదంటే సీబీఐ కేసులతోపాటు కలిపి విచారించాలన్న నిందితుల అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించగా, హైకోర్టు సీబీఐ కోర్టు ఉత్తర్వులనే సమర్థించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని, ఇంకా తీర్పు ప్రతి అందలేదని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది ఎన్.నవీన్‌కుమార్ తెలిపారు. అందువల్ల ఈడీ కేసుల విచారణను వాయిదా వేయాలని కోరగా సీబీఐ కోర్టు అనుమతిస్తూ విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.
జగన్ డిశ్ఛార్జి పిటిషన్‌లో కౌంటరుకు గడువు..
పెన్నా సిమెంట్స్ కేసు నుంచి తప్పించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లో కౌంటరు దాఖలు చేయడానికి సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడువు కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను 6వ తేదీకి వాయిదా పడింది. దీంతోపాటు ఇతర నిందితులైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్, పయనీర్ హోల్డింగ్స్, పెన్నా సిమెంట్స్, పెన్నా తాండూర్ సిమెంట్స్ తదితరుల డిశ్ఛార్జి పిటిషన్‌లపై విచారణ వాయిదా పడింది. పెన్నా గ్రూపునకు చెందిన పి.ఆర్.ఎనర్జీ డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ తరఫు వాదనల నిమిత్తం విచారణ 6కు వాయిదా పడింది.
ఇదీ చదవండి: DRUGS CASE:డ్రగ్స్ కేసు మాటున సినీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ నజర్!