Motor Vehicle Act: కేంద్రం తీసుకువచ్చిన 2019 మోటార్ వెహికిల్ యాక్టు అమలును నిరసిస్తూ వాణిజ్య వాహన యజమానులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని ఇన్ని రోజులు అమలు చేయని తెలంగాణ ప్రభుత్వం... ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం, సరకు రవాణా వాహనాలు, ప్రయాణికుల వాహనాలకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ ఉండాలి. ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై రోజుకు రూ.50 జరిమానా విధిస్తారు.
కరోనా కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైపోయింది. చాలా వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. దాంతో చాలా మంది యజమానులు వారి వాహనాలకు ఫిట్‌నెస్ చేయించలేదు. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత వాహనాలు ఎప్పటిలా తిరుగుతున్నాయి. అయితే ఫిట్‌నెస్ తప్పనిసరి చేయడం, ఫిట్‌నెస్ లేకపోతే రోజుకు రూ.50 జరిమానా విధించడం ఇప్పుడు యజమానులను కలవరపెడుతోంది. గత రెండేళ్లుగా ఫిట్‌నెస్ చేయించని వారు ఇప్పుడు భారీ మొత్తం జరిమానాగా కట్టాల్సి రావడంపై వారు ఆందోళన చెందుతున్నారు.
మోటారు వెహికిల్ యాక్ట్-2019ని ఉపసంహరించుకోవాలని వాణిజ్య వాహనాల యజమానులు ప్రధానంగా కోరుతున్నారు. ఇప్పటికే ఆటో, క్యాబ్, లారీ యజమానులు రవాణాశాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తంచేశారు. ఇటీవల ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. తాజాగా ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు.
జీవో నంబర్ 61, 66లను సవరించి అన్ని రకాల క్యాబ్‌లకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 20వేల కొత్త పర్మిట్లు ఇవ్వాలని, రెండు రాష్ట్రాల మధ్యన కౌంటర్ సిగ్నిచర్, సింగిల్ పర్మిట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన పరిష్కారం రాకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని చెబుతున్నారు.
ఇదీ చదవండి:111 జీవో ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..