Vegetable Prices Hike: కూరగాయలు ధరలు రోజురోజుకీ పైపైకి ఎగబాకుతున్నాయి. ఎండల తీవ్రతతో కూరగాయలు, ఆకుకూరల దిగుబడి తగ్గడం, పెరిగిన పెట్టుబడి వ్యయం, పెట్రో ధరల భారంతో రేట్లకు రెక్కలు వస్తున్నాయి. వారం క్రితం కిలో టమాట ధర వంద రూపాయలుంటే.... ఇపుడిప్పుడే దిగివస్తోంది. బీన్స్, చిక్కుడు, పచ్చిమిరప, క్యాప్సికం, నిమ్మకాయలు, బీర, బెండ ధరలూ మండిపోతున్నాయి. బెంబేలెత్తిస్తున్న ధరలతో కిలో తీసుకునే వారు అరకిలోతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రోజువారీ కూలీలు, నిరుపేదలు మాత్రం ఏం కొనేటట్టు లేదని...ఏం తినలేపోతున్నామని బాధపడుతున్నారు.
జంటనగరాల్లోని రైతుబజార్లలోనూ కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చే సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనే పరిస్థితి లేదని వాపోతున్నాయి. వంటింటి బడ్జెట్ అమాంతం పెరిగిపోతుందని గృహిణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతుబజార్లలోని బోర్డుల మీది రేట్లకంటే కొందరు ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
మార్కెట్ డిమాండ్ అధిగమించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సరుకు తెప్పించి ప్రజల అవసరం తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడి పెరగడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాదిస్తున్నారు. కూలీల ఖర్చు, పంట కోత, రవాణా వ్యయం పోను తమకు అంతంతమాత్రమే మిగులుతుందని ఆవేదన చెందుతున్నారు. మార్కెటింగ్ శాఖ నియంత్రణ లేక దళారులు బాగుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. రైతుబజార్లలో బోర్డులపై నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ వర్షాలు పడి కొత్త పంట రైతుల చేతికొస్తేనేగానీ కూరగాయల ధరలు దిగిరావని అధికారులు అంచనావేస్తున్నారు.
ఇవీ చదవండి:మంత్రి మల్లారెడ్డిపై రెడ్ల ఆగ్రహం.. చెప్పులు, రాళ్లు, కుర్చీలతో దాడి..