హరిద్వార్‌లో జరగనున్న కుంభ మేళాకు వచ్చే భక్తులు, యాత్రికులు కొవిడ్ -19 నిబంధనలను పాటించేలా చూడాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. ఏప్రిల్ ఒకటి నుంచి 30 వరకు కుంభమేళా జరగనుంది. మేళాకు వచ్చే భక్తులు ఎస్‌ఓపీ మార్గదర్శకాలను పాటించేలా చూడాలని.. నిబంధనలపై భక్తులు, యాత్రికులకు అవగాహన కల్పించాలని కోరారు.
ఎస్‌ఓపీ మార్గదర్శకాలు తప్పనిసరి..
65 ఏళ్ల కంటే ఎక్కువ, 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు, మధుమేహం, రక్తపోటు, గుండె, పల్మనరీ, మూత్రపిండాల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు, క్యాన్సర్ సెరెబ్రో వాస్కులర్ డిజార్డర్స్, గర్భిణీలు, కొమొర్బిడిటీ వ్యాధిగ్రస్తులు కుంభమేళాకు వచ్చేందుకు అర్హులు కాదని తెలిపారు.
భక్తులు.. కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించడానికి నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలన్నారు. యాత్రికులు కొవిడ్ పరీక్షల (72 గంటల లోపల చేసుకున్నది) ఆర్టీ పీసీఆర్ రిపోర్ట్‌ను తప్పని సరిగా సమర్పించాలని పేర్కొన్నారు. కుంభమేళాను సందర్శించే ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించుకోవాలని తెలిపారు.
మేళా నుంచి తిరిగొచ్చిన తర్వాత.. సంబంధిత రాష్ట్రాలలో అనుసరిస్తున్న కొవిడ్-19 పరీక్షలు లేదా క్రియాశీల పర్యవేక్షణకు లోబడి ఉండవచ్చన్నారు.
ఇవీచూడండి: కొవాగ్జిన్ టీకా తీసుకున్న కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి