Kishan Reddy Comments: తెలంగాణను కేసీఆర్ కుటుంబానికి రాసివ్వలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ప్రసంగించిన కిషన్‌రెడ్డి.. తెరాస ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. అమిత్‌షా రాష్ట్రానికి వస్తుంటే.. ఎందుకు వస్తున్నారని తెరాస నేతలు ప్రశ్నిస్తున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ముందుగా.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు వేస్తున్న ఎన్నో ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు భాజపా నేతలు బరాబర్ వస్తారని.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కూడా భాజపానేనని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
"తెలంగాణను కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చామా..? రాష్ట్రానికి ఎవ్వరు రావద్దా..? హైదరాబాద్‌కు రావాలంటే కల్వకుంట్ల కుటుంబ అనుమతి తీసుకోవాలా..? భాజపా మద్దతు లేకుండానే తెలంగాణ వచ్చిందా..? వందల మంది ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవరి జాగీర్ కాదు.. ఇక్కడ కూడా అంబేడ్కర్ రాజ్యాంగమే అమల్లో ఉందన్న విషయం మర్చిపోయినట్టున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేడన్న భయంతోనే కొత్తది రాస్తానంటున్నారు. తెలంగాణలో బరాబర్ భాజపా ప్రభుత్వం వస్తుంది. మా నేతలు రాష్ట్రాలకు ఎందుకు రావద్దో చెప్పాలి. భాజపా నేతలు రాష్ట్రంలో ఎందుకు తిరగకూడదో చెప్పాలి. భాజపా నేతలు బరాబర్ తెలంగాణకు వస్తారు. రాష్ట్రంలో వేల కిలోమీటర్ల రహదారులు ఇచ్చారు. ప్రతి ఇంటికి వంట గ్యాస్‌ను మోదీ ఇచ్చారు. రెండున్నరేళ్లుగా పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. దేశంలోని అందరికీ మోదీ ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇచ్చింది. ఇలా ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలు ఇచ్చామని తెలంగాణ ప్రజలకు చెప్పడానికే అమిత్‌షా వచ్చారు. ఎస్టీల రిజర్వేషన్లు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు. ఇప్పటికైనా.. దళితుడిని సీఎం చేసే సత్తా ఉందా..? ఎస్సీలకు మూడెకరాల భూమి ఇచ్చారా..? దళితబంధు, నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారు..?" -కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
ఇవీ చూడండి:
- 'తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకు సిద్ధమవ్వండి..'
- 'కాంగ్రెస్‌కు, తెరాసకు ఇచ్చారు.. భాజపాకూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ప్లీజ్.. ప్లీజ్..'
- కోర్ కమిటీతో అమిత్ షా భేటీ.. పార్టీ బలోపేతం, చేరికలపై కీలక సూచనలు..!
- 'క్లబ్‌లు, పబ్‌లు తప్ప ఏం తెలియని వాళ్లు.. మరో అవకాశం అడుగుతున్నారు'
- కార్పొరేట్లకేమో 80% రుణాలు.. యువత, రైతులకు 9 శాతమా?: భాజపా ఎంపీ