Kishan Reddy comments on CM KCR: ప్రధాన మంత్రి గురించి మాట్లాడేటప్పుడు భాష హుందాతనంగా ఉండాలని.. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయా ప్రాంతాల ఆచార, సంప్రదాయాల మేరకు ప్రధాని మోదీ నడుచుకుంటే కేసీఆర్ విమర్శిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటించాలని.. ప్రధాని వ్యక్తిగత విషయాలపై విమర్శలు తగదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం సరైంది కాదని.. డా. బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని దుయ్యబట్టారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
"హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల తర్వాత భాజపాపై.. సీఎం కేసీఆర్, తెరాస నాయకులంతా విష ప్రచారం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడితే అబద్ధాలు నిజం కావు. సీఎం విషయంలో అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం చెబుతున్నారు. సీఎం ప్రకటన పట్ల రాజకీయాలకు అతీతంగా ఖండించాలి." -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
కేంద్ర బడ్జెట్‌పై ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని.. భాజపా నాయకత్వంపై విష ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రం ఇచ్చిన హామీలు ఎంత వరకు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Telangana MPs On Budget: 'పీఎం కిసాన్ నిధుల కన్నా.. కేసీఆర్ రైతు బంధు నిధులే ఎక్కువ'