కరోనా వైరస్ కట్టడికి కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కొవిడ్ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందడంతో మరోసారి అనేక దేశాలు ఆంక్షల అమలు దిశగా అడుగులేస్తున్నాయి.
ఐరోపాలో ఒమిక్రాన్ ఉద్ధృతి కొనసాగుతోంది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాల్లో రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనా దెబ్బకు యూకే విలవిలలాడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ యూకేలో విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తోంది. బూస్టర్ డోస్‌లు వేస్తున్నా రీఇన్‌ఫెక్షన్ ముప్పు తప్పడం లేదు. భారీగా కేసులు నమోదవుతున్నా మరణాలు తక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
యూకేలో మొదటి వేవ్ సమయంలో 14 రోజులుగా ఉన్న క్వారంటైన్ కాలాన్ని వారం రోజులకు కుదించారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో క్వారంటైన్ సమయాన్ని వారం నుంచి 5 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్ వస్తే కేవలం ఐదు రోజులు మాత్రమే క్వారంటైన్‌లో ఉంటి సరిపోతుందని గతవారం యూకే ఆరోగ్య మంత్రి సాజిద్ జావీద్ వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ ఎమర్జెన్సీ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో బోరిస్ జాన్సన్ ఉన్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల కరోనా కేసులు తగ్గుతాయని అనుకోవడం లేదని, ప్రత్యామ్నాయంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా ఆంక్షలపై ఇప్పటికే బ్రిటన్‌లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.