Ugadi Panchangam 2022: ఉగాది అనగానే అందరికి మెుదటగా గుర్తుకొచ్చే వచ్చేది షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి. ఆ తర్వాతి స్థానం పంచాంగానిదే. రాబోయే సంవత్సర కాలంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ రచనకు సూర్య, దృక్ అనే రెండు సిద్ధాంతాలు మనదేశంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిల్లో సూర్య సిద్ధాంతం అత్యంత ప్రాచీనమైంది.
సుమారు 1800 ఏళ్లుగా ఇది ప్రాచుర్యంలో ఉంది. భట్టోత్పల, దివాకర, కేశవ, విజయనంది, చిత్రభాను, శ్రీరంగనాథ, మకరంద, నరసింహ, భాస్కరాచార్య, ఆర్యభట్ట, వరాహమిహిర తదితర ఖగోళ గణిత శాస్త్రవేత్తలు ఖగోళ పరిజ్ఞానం ఆధారంగా కాలవిభజన చేసి, స్పష్టమైన వివరణ ఇచ్చారు. క్రీ.శ.1178 కాలానికి చెందిన మల్లికార్జున సూరి రాసిన సూర్య సిద్ధాంత భాష్యం... తెలుగు, సంస్కృత భాషల్లో ముద్రితమై ఇప్పటికీ వాడుకలో ఉంది. పంచాంగ రచనలకు ఇదే అత్యంత ప్రామాణికమైన గ్రంథంగా పరిగణిస్తారు.
తెలుగు నాట పంచాంగానికి అమితమైన ఆదరణ ఉంది. ఇదే సమయంలో పలు వివాదాలు సైతం లేకపోలేదు. పండగ తేదీల మొదలు తిథులు ఇతర అంశాల్లోనూ అనేక వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి అధిగమించేందుకు పంచాగకర్తలంతా ఓ సమాఖ్యగా ఏర్పాటయ్యారు. భవిష్యత్తు తరాలకు ఖచ్చితమైన లెక్కలతో పంచాంగాలను అందించేలా తగిన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తున్నారు. సనాతనమైన భారతీయ గణిత విజ్ఞానానికి పంచాంగం మూలస్తంభంగా నిలుస్తోంది. వ్యక్తి జీవితంలోని ప్రతి ఘట్టం పంచాంగంతో ముడిపడి ఉంది. వరాహమిహిర, ఆర్యభట్ట వంటి ప్రాచీనులైన రుషులు ఎన్నో ఖగోళ పరిశోధనలు చేసి, సమున్నతమైన పంచాంగ విజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ఎనలేని వారసత్వ సంపదగా మనకు అందించారు.
ఇదీచూడండి: శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు