తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 175 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి, అయిదు చరవాణులు, ఇంటి తాళాలు పగలగొట్టేందుకు ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు 2009 నుంచి 48 చోరీ కేసులతో సంబంధం ఉంది. దొంగల ముఠాకు కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని కాంగ్రెస్ నేత గొట్టిముక్కల పద్మారావు నివాసంలో సుమారు రెండు కోట్ల రూపాయల సొత్తు కూడా చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసే గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు అనుచరులతో కలిసి వివిధ కాలనీల్లో రెక్కీ నిర్వహించే వారు... ముందుగా తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకొని తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదు అపహరించేవారు. తమ పని పూర్తి చేసుకున్న తర్వాత వీరంతా తిరిగి ఎవరి స్వస్థలాలకు వారు వెళ్లిపోయేవారు. ఆ తర్వాత చోరీ సొత్తును పంచుకునేవారు. చోరీ చేసిన సొమ్ముతో జల్సాల చేసేవారని పోలీసులు తెలిపారు.
ముఠా నాయకుడితోపాటు అతని అనుచరులు దొంగతనం చేసిన సొత్తుతో భూములు, ఇళ్లు కొనుగోలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారణ జరపనున్నట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వారందరిపై పీడీ చట్టం కూడా నమోదు చేయనున్నట్టు ఆయన చెప్పారు.
ఇదీ చూడండి : 'కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి సీఎంకు ఇబ్బంది ఏంటి'