TB patients in Telangana : రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో క్షయ కారణంగా 8,376 మంది మృత్యువాతపడడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. 2022 జనవరి నుంచి జులై 25 వరకూ టీబీ కారణంగా 798 మంది మృతిచెందారు. క్షయ మరణాల్లో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. మహమ్మారి కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇదే కాలంలో(తొలి ఏడు నెలల్లో) అత్యధికంగా 6,896 మంది మరణించగా.. మహారాష్ట్రలో 2,845 మంది, గుజరాత్‌లో 2,675 మంది, మధ్యప్రదేశ్‌లో 2,450 మంది మృతిచెందారు.
Tuberculosis patients in Telangana : రాష్ట్రంలో టీబీ కేసులు హైదరాబాద్‌లో అత్యధికంగా 6,235 నమోదు కాగా.. తర్వాతి స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి(2,356), రంగారెడ్డి(2,294), నల్గొండ(1,409), ఖమ్మం(1,299 కేసులు) జిల్లాలున్నాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 232 కేసులు నమోదయ్యాయి. 2021 జనవరి- సెప్టెంబర్ మధ్య రాష్ట్రంలో క్షయకు చికిత్స పొందినవారిలో 89 శాతం మందికి వ్యాధి నయమవగా.. మెదక్ జిల్లాలో అత్యధికంగా 97 శాతం మంది ఆరోగ్యవంతులయ్యారు. అతి తక్కువగా నయమైన జిల్లాగా జనగామ(79 శాతం) నిలిచింది.
Tuberculosis cases in Telangana : 2019 నుంచి 2022 జులై 25 వరకూ గణాంకాలను పరిశీలిస్తే.. కేసులు తగ్గుతున్నట్లుగా అనిపించినా.. వాస్తవానికి క్షయ కేసుల నమోదులో నిర్దేశిత లక్ష్యాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ అందుకోలేదు. 2019లో 100 శాతం లక్ష్యం సాధించగా.. 2020లో 77 శాతం.. 2021లో 74 శాతం మాత్రమే నిర్దేశిత లక్ష్యాన్ని నమోదు చేసుకున్నట్లుగా ఆరోగ్యశాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అన్ని అవయవాలకూ.. క్షయవ్యాధి జుట్టు, గోళ్లు మినహా.. శరీరంలోని అన్ని అవయవాలకూ వ్యాపించే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఊపిరితిత్తులు, ఎముకలు, పేగులు, మూత్రపిండాలు, మెదడు, వెన్నెముక, శోషరస గ్రంథుల(లింఫ్‌నోడ్స్)లకు సోకుతుంది. అధునాతన ఔషధాల ద్వారా క్షయను 100 శాతం నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ టీబీ వ్యాధిగ్రస్తులకు బలవర్థక పోషకాహారాన్ని అందించేందుకు నెలకు రూ.500 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. ఇందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్రానిది 40 శాతం. అయితే రాష్ట్రంలో జనవరి నుంచి జులై 25 వరకూ 22,795 (67%) మందికే ఈ సాయం అందింది. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 91% మంది క్షయ రోగులకు సాయం అందింది. జనగామ జిల్లాలో 52 శాతం, మహబూబాబాద్ జిల్లాలో 56 శాతం, సిద్దిపేట, ములుగు జిల్లాలో 55 శాతం, కామారెడ్డి జిల్లాలో 57 శాతం చొప్పున ఆర్థిక సాయం అందగా.. అతి తక్కువగా రంగారెడ్డి జిల్లా బాధితులకు 49 శాతం సాయం ముట్టింది.
టీబీని గుర్తించడమిలా..
- 2 వారాలకు పైగా ఎడతెగని దగ్గు, జ్వరం
- తెమడలో రక్తం పడుతుండడం
- గుర్తించే రీతిలో బరువు తగ్గిపోవడం
- ఛాతీ ఎక్స్‌రేలో అసాధారణ మచ్చలు కనిపించడం