స్వర్ణాభరణాలు...వజ్ర వైడూర్యాలు...మరకత మాణిక్యాలతో అలంకారభూషితుడై భక్తులకు దర్శనమిచ్చే శ్రీవారు కొలువైన అనంద నిలయాన్ని స్వర్ణమయం చేయాలన్న నిర్ణయాన్ని తితిదే వెనక్కు తీసుకొంది. వంద కోట్ల రూపాయల అంచనాతో 2008లో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం చేపట్టారు. దాతల నుంచి తితిదే విరాళాలు కోరడంతో... ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు విశేషంగా స్పందించారు. 270 మంది భక్తులు 95 కిలోల బంగారం, 13 కోట్లు రూపాయల నగదు అందజేశారు.
తొలి విరాళంగా ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అప్పటి ముఖ్యమంత్రి హోదాలో బంగారాన్ని అందచేశారు. దేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా స్పందించారు. భక్తులు విరాళాలు అందచేసినా ఏడాది తర్వాత కోర్టులో కేసులు, ఆపై హైకోర్టు తీర్పు వల్ల... పథకం అమలుపై నీలినీడలు కమ్ముకొన్నాయి. చివరకు 2019 నవంబర్ 28 జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో అనంత స్వర్ణమయం బంగారాన్ని వెనక్కు ఇవ్వాలని తీర్మానించారు.
వివాదాల నేపథ్యంలో మూడు కిలోల బంగారాన్ని దాతలు వెనక్కు తీసుకోగా 27 కేజీలను ఇతర పథకాలకు మళ్లించారు. మిగిలిన 65 కిలోల బంగారం ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం పథకం అకౌంట్లోనే ఉంది. ఈ బంగారాన్ని వెనక్కుతీసుకోవాలని..లేనిపక్షంలో ఇతర పథకాలకు మళ్లిస్తామని ఛైర్మన్ ప్రకటించారు.
ఆనంద నిలయం స్వర్ణమయం పథకం అమలుకు ఆదికేశవులునాయుడు తీవ్రంగా కృషిచేశారు. ఆయన వేసిన పిల్ సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే భక్తులు ఇచ్చిన బంగారం, నగదును వెనక్కు ఇవ్వాలని నిర్ణయించడంతో ఈ పథకం పూర్తిగా అటకెక్కినట్లైంది.
ఇదీ చదవండి: పులి సంచారంతో వణుకుతున్న గ్రామాలు.. కొనసాగుతోన్న అన్వేషణ