Government Jobs in Telangana: తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో ప్రొఫెసర్, సహాయ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీకి ప్రకటన జారీ చేసేందుకు కమిషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సోమవారం 27 పోస్టులతో ఉద్యోగ ప్రకటన వెలువరించింది. ఈ పోస్టులకు సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి బాధ్యతలు అప్పగించినప్పటికీ.. సంబంధిత ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదనలు ఆలస్యం చేయడం, సర్వీసు నిబంధనలు సరిచూసుకోకపోవడం, విద్యార్హతలు, ఇతర అర్హతల ఖరారులో స్వల్ప పొరపాట్లతో ప్రకటనలు వెలువరించేందుకు సాంకేతిక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సంబంధిత విభాగాల నుంచి అందిన ప్రతిపాదనలు పరిశీలించినపుడు ఆయా లోపాల్ని కమిషన్ ఎత్తిచూపుతూ, సర్వీసు నిబంధనల ప్రకారం చేయాల్సిన మార్పులను సూచిస్తోంది. ఇంజినీరింగ్, ఇతర స్పెషలైజేషన్ పోస్టులకు ప్రకటనలు జారీ చేయాలని కమిషన్ భావించినప్పటికీ, పలు కారణాలతో ఆలస్యమైంది.
ప్రకటన వచ్చినా.. దరఖాస్తులేవీ?
TSPSC Job Notifications : రాష్ట్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) మల్టీజోన్-1, 2లో కలిపి 113 ఏఎంవీఐ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటన జారీచేసింది. ఈనెల 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. అయితే అర్హత నిబంధనలు రూపొందించడంతో రవాణాశాఖ చేసిన పొరపాట్లతో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పోస్టులకు నిబంధనల ప్రకారం మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన అర్హత లేదా మూడేళ్ల ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హతతో పాటు లారీ, బస్సు లాంటి భారీవాహనాలు నడిపేందుకు లైసెన్సు కలిగి ఉండాలని పేర్కొంది. అయితే గతంలో మహిళా అభ్యర్థులు తేలికపాటి వాహన లైసెన్సు ఉన్నప్పటికీ అర్హులేనని, ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోగా హెవీమోటారు వాహన లైసెన్సు పొందాలని స్పష్టం చేసింది. ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లో.. నోటిఫికేషన్ తేదీ నాటికి పురుష, మహిళా అభ్యర్థులు భారీ వాహనాల లైసెన్సు ఉండాలని తెలిపింది. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గతంలో మాదిరి అర్హతలు మార్చాలని, భారీవాహన లైసెన్సు పొందేందుకు సమయం కావాలని రవాణాశాఖ, టీఎస్‌పీఎస్సీని కలిసి వివరించారు. దీంతో ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణ నిలిపివేసిన కమిషన్.. స్పష్టమైన వివరణ ఇవ్వాలని రవాణాశాఖకు లేఖ రాసింది. అయితే ఇప్పటివరకు వివరణ రాలేదు. ఈ వివరణ వచ్చిన తరువాత సవరణ ప్రకటనతో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేసే అవకాశముంది.
వివరణ వస్తే.. త్వరలో ప్రకటన.. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, పురపాలన, ప్రజారోగ్య శాఖల్లో ఇంజినీరింగ్ పోస్టుల ప్రకటన జారీకి ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ విభాగాల్లో దాదాపు 1500 వరకు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన సర్వీసు నిబంధనల్లో స్వల్ప మార్పులు జరగాల్సి ఉంది. ఈ విషయమై కమిషన్ వర్గాలు ఇప్పటికే ఆయా విభాగాల్ని వివరణ కోరింది. సంబంధిత విభాగాలు సర్వీసు నిబంధనల్లో మార్పులతో వివరణలు పంపిస్తున్నారు. ప్రభుత్వ విభాగాల వివరణలు ఆలస్యం కావడంతో ఇంజినీరింగ్ ఉద్యోగాలకు ప్రకటన నిలిచిపోయింది. ప్రభుత్వశాఖల నుంచి వివరణ వచ్చిన వెంటనే ఇంజినీరింగ్ పోస్టులకు ప్రకటన జారీ చేయాలని కమిషన్ భావిస్తోంది.