పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అల్లర్లు సృష్టించి అధికార పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందని తెజస అధ్యక్షుడు, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల అభ్యర్థి కోదండరాం ఆరోపించారు. పల్లా రాజేశ్వర్రెడ్డి ఈమేరకు పావులు కదుపుతున్నట్లు తమకు పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఆ వివరాలతో తెజస ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావుతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో రాత్రి సమయంలో గొడవ చేసి ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెరాస చూస్తోందని ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, నిజాయతీగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెజస నేతలు తెలిపారు.
ఇవీచూడండి: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. రాత్రికి తొలి రౌండ్ ఫలితాలు!