శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సందర్శించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జల విద్యుత్ ఉత్పత్తి రంగంలో గత సంవత్సరం అగ్రగామిగా నిలిచిన శ్రీశైలం ప్రాజెక్టు అధికారుల పనితీరును ప్రభాకర్ రావు అభినందించారు.
పవర్ గ్రిడ్ డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఏడాది కూడా 4,500 మిలియన్ యూనిట్ల కంటే అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని అధికారులకు సూచించారు. భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రధానమైన మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఏ & సీ, మాస్టర్ కంట్రోల్ గదులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అణువణువు పరిశీలించి జీరో లెవల్ నుంచి సర్వీస్ బే వరకు కాలినడకతో తిరుగుతూ కీలక మరమ్మతులను గుర్తించి అధికారులకు ప్రభాకర్ రావు పలు సూచనలు చేశారు. విధుల్లో నిమగ్నమైన కార్మికులు, సిబ్బందితో పాటు వారి కుటుంబాలను కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైనే ఉందని సీఎండీ స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి: వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్ వేయాల్సిందే!