రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతినెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. జనవరి నుంచి ఒక్కో డీడీఓ పరిధిలోని ఉద్యోగులకు ఒక్కో తేదీన 1 నుంచి 10వ తేదీ వరకు వేతనాలు అకౌంట్లలో జమ అవుతున్నాయన్నారు. ఈ మేరకు దోమలగూడ ప్రెస్మీట్లో మాట్లాడారు.
"తొలుత సాంకేతిక ఇబ్బందులు అనుకున్నాము. కానీ ప్రతినెలా ఇదొక ఆనవాయితీగా ఆర్థిక శాఖ పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. పనిచేసిన కాలానికి ఇచ్చే వేతనం నెల మొదటి తేదీనే ఇవ్వాలని కూడా రాష్ట్రంలో డిమాండ్ చేయాల్సిరావటం నిజంగా విచారకరం. ఈ నెల ఏడవ తేదీ నాటికి ఇంకా ఆదిలాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో సెప్టెంబర్ నెల వేతనాలు జమ కాలేదు"
-చావ రవి, టీఎస్ యుూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ కుటుంబ అవసరాల కోసం తాము దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము నుంచి మంజూరైన రుణాలు, పాక్షిక ఉపసంహరణ, రిటైరైన, మరణించిన ఉద్యోగుల తుది చెల్లింపులు పొందటానికి కూడా నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్, రిటైరైన ఉద్యోగుల సెలవు జీతాల సొమ్ము విడుదల చేయడంలో కూడా విపరీతమైన జాప్యం జరుగుతోందని ఆరోపించారు.