కోర్టు దిక్కరణ కింద ఇద్దరు ఐఏఎస్, ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌లతో సహా ఆరుగురు అధికారులకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టి వేసింది. ధిక్కరణ కింద అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, రంగారెడ్డి జిల్లా సీసీఎఫ్ సునీత ఎం భగవత్, అటవీ శాఖ ప్రధాన అధికారి శాంత, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి తిరుపతిరావు, రంగారెడ్డి జిల్లా అటవీ అధికారి జానకిరాంకు ఆరు నెలల పాటు సాధారణ జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును రద్దు చేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సర్వే నెంబర్ 222/1 నుంచి 222/20 వరకు ఉన్న 383 ఎకరాల భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చాలన్న ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని ఆ భూమిని మినహాయించాలంటూ.. 2008 జనవరిలో ఫారెస్టు సెటిల్‌మెంట్ అధికారి రంగారెడ్డి కలెక్టర్‌కు రాసిన లేఖపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంలే ప్రత్యామ్నాయంగా భూమిని వారికి అప్పగించాలంటూ 2009 డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో మహ్మద్ సిరాజుద్దీన్ మరో 9 మంది 2015లో కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తర్వులు అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందంటూ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి జులైలో తీర్పు వెలువరించారు.
కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష విధించిన తీర్పును సవాలు చేస్తూ ఆరుగురు అధికారులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 2009లో ఇచ్చిన ఉత్తర్వులపై 2021లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. కాలపరిమితి ముగిసినందున కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. అప్పీళ్లను అనుమతిస్తూ సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. అయితే డీఎఫ్‌ఓ రాసిన లేఖపై తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా చట్టపరమైన విధానాన్ని అనుసరించవచ్చని అనుమతించింది.
ఇదీ చూడండి:
CM KCR: అంగన్వాడీ కేంద్రాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పునఃప్రారంభం