HC on Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్- ఈడీకి సమాచారం, వివరాలు ఇచ్చామని ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నివేదించారు. పరిపాలనాపరమైన కారణాల వల్ల హైకోర్టు ఉత్తర్వుల అమలులో కొంత ఆలస్యం జరిగినందుకు బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో హైకోర్టు ఆదేశించినప్పటికీ... తమకు అవసరైన వివరాలు ఇవ్వడం లేదంటూ సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
అన్ని వివరాలు అందించాం: గత ఆదేశాల మేరకు సర్ఫరాజ్ అహ్మద్ కౌంటరు దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తి వివరాలతో మార్చి 21న 828 పేజీలతో కూడిన నివేదిక సమర్పించినట్లు ఎక్సైజ్ డైరెక్టర్ వెల్లడించారు. వివిధ కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలను కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలిపారు. కెల్విన్ కేసులో సేకరించిన వాట్సప్ స్క్రీన్ షాట్లు కూడా ఈడీకి అప్పగించామన్నారు. డ్రగ్స్ కేసుల్లో నిందితుల కాల్ డేటాను దర్యాప్తు అధికారులు సేకరించలేదన్న సర్ఫరాజ్ అహ్మద్... కెల్విన్ కేసులో సమాచారం కోసం సిట్ సేకరించిన 12 మంది కాల్ డేటాను ఈడీకి ఇచ్చినట్లు కౌంటరులో వివరించారు. విచారణ ప్రక్రియలో భాగంగా 12 మందిని ప్రశ్నించినప్పుడు చిత్రీకరించిన వీడియో దృశ్యాలను పెన్ డ్రైవ్‌లో ఈడీకి సమర్పించినట్లు ఎక్సైజ్ డైరెక్టర్ తెలిపారు.
విచారణ వాయిదా: హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశం తమకు లేదని.. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈడీకి సమాచారం ఇవ్వడంలో కొంత ఆలస్యమైందని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని... కోర్టు ధిక్కరణ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. ఈడీకి ఇచ్చిన వివరాలు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు తమకు సమయం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది ప్రవీణ్ కుమార్ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. విచారణను వేసవిసెలవుల అనంతరం చేపడతామని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: రెండురోజుల క్రితం గృహ ప్రవేశం- దంపతులు సజీవ దహనం
Revanth Reddy On PK: 'ఆరోజు పీకేనే తెరాసను ఓడించాలని చెబుతారు'