సచివాలయ భవనాల కూల్చివేత అంశంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కొత్త సచివాలయం నిర్మాణం పేరుతో తెరాస ప్రభుత్వం ప్రజాధనం వృథా చేస్తోందని పిటిషనర్లు వాదనలు వినిపించారు. రాష్ట్ర పరిపాలన కేంద్రంలో కొన్ని కొత్తగా నిర్మించిన భవనాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని సైతం కూల్చాలనే నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నిర్ణయం వందల కోట్ల ప్రజాధనం వృథా చేయడం తప్ప మరొకటి కాదని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు.
తొలగిన ఆటంకాలు
సచివాలయ నిర్మాణం విధానపరమైన నిర్ణయమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని వివరించింది. సాంకేతిక పరంగానూ సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుకూలంగా లేదని పేర్కొంది. భవనాలన్నీ కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు దృష్టికి తెచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మంత్రిమండలి నిర్ణయాన్ని తప్పుపట్టలేమని తెలిపింది. ఈ అంశంలో వేసిన కేసులన్నీ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుతో సచివాలయం నిర్మాణానికి ఆటంకాలు తొలగినట్లయింది. ఇప్పటికే సచివాలయ భవనాలు ఖాళీ చేసిన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు- బీఆర్కేఆర్ భవన్‌ను పాలనా కేంద్రంగా మలుచుకుంది. అక్కడి నుంచే పలు శాఖలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
హైకోర్టు తీర్పుతో సచివాలయ నిర్మాణం వేగం పుంజుకునే అవకాశముంది. ఈమేరకు ప్రభుత్వం తదుపరి కసరత్తు ప్రారంభించింది. పాత సచివాలయ ప్రాంగణంలోకి ఎవర్నీ అనుమతించవద్దని ఆదేశాలు జారీచేసింది. భద్రతా విధుల్లోఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందిని అక్కడ నుంచి మార్చాలని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్