రాష్ట్రంలో 1,500 కేసులు.. జీహెచ్‌ఎంసీలో 250లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయంటే.. అది ప్రజల సహకారం వల్లనేనని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు, వైద్య విద్య సంచాలకులు తెలిపారు. అందుకే తిరిగి ప్రజల సహకారం కోరుతున్నామన్నారు. అందుకోసం ప్రచార పోస్టర్లు, రేడియో జింగిల్స్‌ను.. యానిమేషన్లను తయారు చేయించి సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. కేరళ, దిల్లీలలో నిబంధనలు పాటించకపోవడం వల్లే.. తిరిగి కరోనా విజృంభిస్తోందని పేర్కొన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కరోనాను కట్టడి చేయడంలో సహకరించండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఏ స్థాయిలో కట్టడి చేస్తున్నామంటే..
ప్రతి పది లక్షల మందిలో లక్ష 2 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నామని సంచాలకులు శ్రీనివాస్, రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీలో ప్రస్తుతం కేవలం 350 మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నారంటే.. కరోనాను ఏ స్థాయిలో కట్టడి చేస్తున్నామో అర్థం చేసుకోవాలన్నారు. కలుషిత ఆహారం, నీరు వల్ల వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఉన్నాయని.. నీళ్లు వేడి చేసుకుని, ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలన్నారు.
టీకా వస్తే ఎవరికి ఇస్తామంటే..
కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు మరో మూడు, నాలుగు నెలల సమయం పట్టే అవకాశముందన్నారు. టీకా అందుబాటులోకి వస్తే.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఎవరికి ముందు ఇవ్వాలనే ప్రాధాన్యతను తయారు చేస్తున్నామన్నారు. అన్ని రకాల ప్రోటోకాల్స్ పూర్తైన తర్వాతనే వ్యాక్సిన్ అందజేస్తామన్నారు.
ఇవీచూడండి: శీతాకాలంలో కాలుష్యంతో కరోనా మరింత ఉద్ధృతం!