కేంద్ర పెద్దలు, భాజపా నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల మండిపడ్డారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో 4 రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.
జిల్లా డయాగ్నిస్టిక్ హబ్‌లు..
రేపట్నుంచి 19 జిల్లా డయాగ్నిస్టిక్ హబ్‌లు ప్రారంభిస్తామని ఈటల వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి జిల్లా డయాగ్నిస్టిక్ కేంద్రంలో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకొకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలని ఈటల సూచించారు. 2, 3 రోజుల్లో అన్ని జిల్లా డయాగ్నిస్టిక్ సెంటర్లు ప్రారంభిస్తాని పేర్కొన్నారు.
ఆక్సిజన్ లేక చనిపోవడం అవమానకరం..
రాష్ట్రానికి 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రాన్ని కోరితే.. 306 టన్నులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రానికి దగ్గర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్ లేక చనిపోవడం దేశానికి అవమానకరమన్న ఈటల.. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఈటల వెల్లడించారు.
రోజుకు 10 లక్షల డోసులు..
వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి యుద్ధప్రాతిపదికన పెరగాలని... లేకుంటే పరిస్థితి గందరగోళమవుతుందని అధికారులు చెప్తున్నారన్నారు.. మంత్రి ఈటల. రాష్ట్రంలో 18-44 ఏళ్ల మధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలని వెల్లడించారు. రాష్ట్రానికి రోజుకు 10 లక్షల డోసులు ఇచ్చే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఏఎన్ఎంలు ఇంటికి వెళ్లి టీకా వేసే అవకాశం ఉందని చెప్పారు. టీకాలు వచ్చే పరిస్థితిని బట్టి ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. 3.5 కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. టీకా, పరీక్షలు వేరువేరు కేంద్రాల్లో ఉండాలన్న వాదన ఉందన్నారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం ప్రణాళికను ప్రకటించాలని మంత్రి కోరారు. కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రెమ్‌డెసివర్ తక్కువకు తయారు చేసి ఎక్కువకు అమ్ముతున్నారన్న మంత్రి.. కేంద్రం దృష్టి సారించి రెమ్‌డెసివర్ లాంటి ఔషధాల ఉత్పత్తి పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఔషధాలు బ్లాక్ మార్కెట్‌కు పోకుండా చూడాలని కోరారు. జాతీయ విపత్తు సమయంలో కేంద్రం అన్నింటినీ నియంత్రణ చేయలేదా అని నిలదీశారు.
లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదు..
తాము కేంద్రాన్ని విమర్శించట్లేదన్న మంత్రి.. వారే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. సాయం చేసే స్థితి నుంచి.. చిన్న దేశాల సాయం పొందే పరిస్థితి వచ్చిందంటూ కేంద్రంపై ఈటల అసంతృప్తి వ్యక్తం చేశారు. టీకాలు దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా అని ఈటల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఈటల హెచ్చరించారు. టీకాల కోసం సీఎస్ నేతృత్వంలోని కమిటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ఈటల స్పష్టం చేశారు.