ఆగస్టు 15న పట్టణ ప్రాంతాల్లో 10,500 ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహరాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో ఆయన పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, స్మార్ట్ సిటీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వీధివ్యాపారుల నమోదు తదితర అంశాలను సమీక్షించారు. పట్టణాల్లోని ప్రతి వెయ్యి మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎస్ వెల్లడించారు. అందులో సగం మహిళలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 400 మొబైల్ టాయిలెట్లను అక్టోబర్ రెండో తేదీన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 132 పట్టణాల్లో బయో మైనింగ్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మానవ వ్యర్థాల శుద్ధి నమూనాను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని... ఫలితంగా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపడుతుందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్న టీఎస్ బీపాస్‌తో భవనాల అనుమతుల ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఏర్పడుతుందని సోమేశ్ కుమార్ వివరించారు. వార్డు స్థాయి బృందాల ఏర్పాటు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామంతో ఐదు లక్షల మంది వీధి వ్యాపారులను నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎస్ తెలిపారు.