తెలంగాణలో టీఆర్టీ తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఫలితాలు విడుదలయ్యాయి. 3,786 మంది అభ్యర్థులను ఎస్జీటీ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఎస్జీటీ ఫలితాలను గతంలోనే విడుదల చేసింది. ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఫలితాలు గతేడాది డిసెంబరు 31న... తెలుగు మీడియం ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 4న వెల్లడించింది. 27 మంది అభ్యర్థులు ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల నుంచి మరో సారి రీలింక్విష్ మెంట్ తీసుకొని సెప్టెంబరు 30లోగా ఫలితాలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
హైకోర్టు విధించిన గడువులోగా ఫలితాలను ప్రకటించడంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలం కావడం వల్ల కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ప్రగతిభవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. మంత్రి కేటీఆర్ స్పందించి టీఎస్‌పీఎస్సీ అధికారులతో మాట్లాడి.. త్వరలో ఫలితాలు వెల్లడవుతాయని హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్... రెండు రోజుల్లో ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఫలితాలను కూడా ప్రకటించేందుకు ప్రయత్నిస్తోంది. మరోసారి రీలింక్విష్ మెంట్ తీసుకోవడం వల్ల.. గతంలో ఎంపిక కాని సుమారు వంద మంది అభ్యర్థులు తాజాగా ఎంపికయ్యారు.
ఇవీ చూడండి:బడ్జెట్ నిధుల విడుదల్లో కొత్త విధానం