ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు వెలువెత్తుతున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. భాజపా నాయకలు ఏమి చెప్పినా వినేందుకు ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు... హుషారైన హైదరాబాద్ నగరమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందని ఈ ప్రశాంతతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. ఇప్పటికే హైదరబాద్‌లో ఐదు లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పేకాట క్లబ్బులు, పబ్బులు లేవని, పోకిరీల బెడద లేదనని స్పష్టం చేశారు. ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టి మత విద్వేషాలు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మొన్న కరోనా వచ్చినా... నిన్న వరదలు వచ్చినా ప్రజల వెంట ఉన్నది తెరాసయేనని ప్రజలకు తెలుసునన్నారు.
ప్రజలకు అంతా తెలుసు
వరదలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ప్రభుత్వం రూ.10వేలు అందజేస్తున్న సాయాన్ని ఆపింది ఎవరో కూడా విజ్ఞులైన ప్రజలకు తెలుసునని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి వాళ్లు ఎన్నికల్లో గెలిస్తే రూ.25 వేలు ఇస్తామని మభ్యపెడుతున్న వాళ్లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. చలాన్లు కడుతామని అది ఇస్తాం... ఇది ఇస్తామని తలాతోక లేకుండా కొందరు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హిందు-ముస్లీంల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టాలని భాజపా నేతలు చూస్తున్నారని విమర్శించారు. విద్వేషాలు రెచ్చగొట్టి నాలుగు ఓట్లు దండుకోవాలనే కుట్రలను నగర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ది కోసం తెరాస కృషి చేస్తుందన్నారు. గడిచిన ఆరేళ్లలో రూ.67వేల కోట్ల నిధులు అభివృద్ది కోసం ఖర్చు చేశామని వివరించారు. కేంద్ర సహాయశాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. మరింత అభివృద్ధి చేసేందుకు తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: మీరు పైసా ఇవ్వకున్నా... మేం ఎంతో చేశాం: కేటీఆర్