తెరాస... మహిళలకు పెద్ద పీట వేస్తుందనేందుకు హైదరాబాద్ మేయర్, ఉపమేయర్ పదవులే నిదర్శనమని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. నూతన మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డిని సత్యవతి రాఠోడ్ సహా తెరాస మహిళా నేతలు తెలంగాణ భవన్లో సన్మానించారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే మహాయజ్ఞంలో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రశంసించారు. జనరల్ మహిళ స్థానాన్ని బీసీకి ఇవ్వడం, డిప్యూటీ మేయర్ పదవిని ఉద్యమకారులకు ఇవ్వడం కేసీఆర్ గొప్పదనమని ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు. తమపై తెరాస, సీఎం కేసీఆర్ పెట్టిన విశ్వాసాన్ని కాపాడుకుంటామని మేయర్ గద్వాల విజయలక్ష్మి, మోతె శ్రీలత రెడ్డి అన్నారు.