TRS protest against center: ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ రాష్ట్రంలోని జాతీయ రహదారులపై తెరాస శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. పలుచోట్ల రహదారులపై బైఠాయించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కేంద్రం మెడలు వంచైనా ఆఖరి గింజ కొనేదాకా కొట్లాడతామని స్పష్టం చేశారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జై జవాన్ పేరుతో గత ఎన్నికల్లో పబ్బం గడుపుకున్న భాజపా.. జైకిసాన్ నినాదాన్ని మరచిపోయారని విమర్శించారు.
నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వద్ద 44వ జాతీయరహదారిపై తెరాస చేపట్టిన హైవే దిగ్బంధన కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్, రేఖానాయక్ హాజరయ్యారు. రహదారిపై ధాన్యం, వరిపంటను పోసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. పంజాబ్ తరహాలో పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జాతీయ రహదారిపై తెరాస నాయకుల ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద బైఠాయించి.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పటాన్‌చెరు వద్ద జాతీయ రహదారిపై కేంద్రప్రభుత్వం వడ్లు కొనాలనే డిమాండ్‌తో తెరాస రాస్తారోకో చేపట్టింది. ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని కేంద్రం తెలంగాణ ప్రజలను అవమానిస్తోందని ఆక్షేపించారు.
ఆలేరు వద్ద నిర్వహించిన నిరసనలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద విజయవాడ జాతీయరహదారిపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బైఠాయించారు. భాజపా, కాంగ్రెస్ రైతులను వంచిస్తున్నాయని మండిపడ్డారు. కోదాడ వద్ద జాతీయ రహదారి దిగ్బంధనంలో కోదాడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి పాల్గొన్నారు. తెరాస శ్రేణుల ఆందోళనతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.
నాగార్జనసాగర్ హైవేపై పెద్దవూర వద్ద ఎమ్మెల్యే నోముల భగత్ ఆందోళనలో పాల్గొన్నారు. మిర్యాలగూడ రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిపై తెరాస శ్రేణులు ధర్నాకు దిగాయి. కేంద్రం దిగొచ్చేదాకా ఉద్యమిస్తామని నినదించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ జందాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలోని జాతీయరహదారిపై భైఠాయిచి తెరాస నేతలు నిరసన తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ తెరాస శ్రేణులు హైవేలపై నిరసనలతో హోరెత్తించాయి.
ఇదీ చూడండి: