నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల ఎంపిక కోసం తెరాస కొన్నాళ్లుగా సుదీర్ఘ కసరత్తు చేసింది. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీతో పాటు.. సామాజిక, రాజకీయ సమీకరణలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, దయానంద్‌కు కలిసోచ్చాయి. రాములు నాయక్, కర్నె ప్రభాకర్, నాయని నర్సింహారెడ్డి స్థానాల్లో ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కాబోతున్నారు. రాములు నాయక్‌పై అనర్హత వేటు పడినప్పటి నుంచే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిపై పలువురు నేతలు ఆశలు పెంచుకున్నారు. కర్నె ప్రభాకర్, నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ పదవి కోసం నేతలు కేసీఆర్, కేటీఆర్ వద్ద పలువురు నేతలు బారులు తీరారు.
హామీ మేరకు
కర్నె ప్రభాకర్‌తో పాటు కవి దేశపతి శ్రీనివాస్, సీతారాం నాయక్ తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. నాయిని నర్సింహారెడ్డి కూడా మరణించిక ముందు మరోసారి అవకాశం కోసం ప్రయత్నాలు చేశారు. బీసీ సామాజిక వర్గం నుంచి మరోసారి అవకాశం లభిస్తుందని కర్నె ప్రభాకర్ ఆశించారు. అయితే బీసీ నుంచి జాతీయ రజక సంఘం నేత, మాజీ మంత్రి బస్వరాజు రాజయ్యకు అవకాశం దక్కింది. తెరాసలో చేరేటప్పుడే ఎమ్మెల్సీ పదవిపై సారయ్యకు కేసీఆర్ హామీ ఇచ్చారు. పలుమార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన సారయ్యకు ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి వరించింది.
అనూహ్యంగా గోరటి పేరు
కవి దేశపతి శ్రీనివాస్... గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించారు. కానీ గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే అనూహ్యంగా ఎస్సీ మాల వర్గానికి చెందిన ప్రజా కవి గోరటి వెంకన్న పేరు తెరపైకి వచ్చింది. చివరికి ఆయన వైపే కేసీఆర్, కేటీఆర్ మొగ్గు చూపారు. రాములు నాయక్ స్థానంలో ఎస్టీ సామాజిక వర్గానికే చెందిన మాజీ ఎంపీ సీతారాం నాయక్‌కు ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. నాయిని స్థానంలో ఓసీకే ఇస్తారన్న ఉద్దేశంతో మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరిగింది. పోటీ తీవ్రంగా ఉండటంతో పలు మార్లు వాయిదా వేస్తూ సుదీర్ఘ కసరత్తు చేశారు. చివరికి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ, ఎస్సీ, ఓసీ వర్గాలకు చెందిన సారయ్య, గోరటి వెంకన్న, దయానంద్‌లకు పదవులు దక్కాయి.
ఇదీ చదవండి : పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?