TRS MPs on Paddy Procurement: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తోందని తెరాస ఎంపీలు ఆక్షేపించారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు సహా ఎంత మేర వడ్లు సేకరిస్తారో చెప్పడం లేదని మండిపడ్డారు. రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ప్రకటన తూతూ మంత్రంగా ఉందని ఆరోపించిన ఎంపీలు.. భవిష్యత్‌లో తెలంగాణ ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఏడాదికి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని అడిగినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని తెరాస పార్లమెంటరీపార్టీ నేత కేకే తెలిపారు. బాయిల్డ్ రైస్ సేకరణపైనా పాతమాటే చెప్పారన్నారని.. పూర్తిగా బాయిల్డ్ రైస్ తీసుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారన్నారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Nama fires on central government: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నుంచి ఉభయ సభల్లో రైతుల సమస్యల గురించి నిలదీసినట్లు తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు తెలిపారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని పదే పదే కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేదని నామ ఆరోపించారు. సీఎం, కేటీఆర్ నేతృత్వంలోని బృందాలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సరైనా స్పందన లేదన్నారు.
దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విధానం ప్రవేశ పెట్టాలని, తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు. మోదీ ప్రభుత్వం పేదల, రైతు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది’.
- నామ నాగేశ్వరరావు. తెరాస లోక్‌సభాపక్ష నేత