రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఏ నిమిషంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఖరారయిన అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని ప్రగతి భవన్ నుంచి సమాచారం అందింది.
ఏ క్షణమైనా జాబితా..
పోటీ తీవ్రంగా ఉన్నందున ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై గులాబీ పార్టీ అధిష్ఠానం ఆచితూచి కసరత్తు చేసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. మధుసూదనచారి, ఆకుల లలిత పేర్లు కూడా తుది పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి స్థానంలో మరో నేతకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్‌కు రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి.. స్థానిక సంస్థల కోటా నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తదితరులు సమాలోచనలు జరిపారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. 17వ తేదీన పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 22వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.
స్థానిక సంస్థల కోటాలో..
స్థానిక సంస్థల కోటాలో 9 జిల్లాల్లో ఖాళీ అయిన 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు (MLC elections telangana) జరగనున్నాయి. స్థానిక సంస్థల అభ్యర్థులపై కూడా తెరాస నాయకత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవిత (Kavitha), బాలసాని లక్ష్మీనారాయణ (balasani Lakshmi Narayana), భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. అందరూ మరోసారి కొనసాగాలని ఆశిస్తున్నారు. అయితే తెరాస అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇస్తోందో చూడాలి.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేపటి నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. డిసెంబర్ 10న పోలింగ్.. డిసెంబరు 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ పేర్కొంది.