ఈటల రాజేందర్... బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర అని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. మేకవన్నిన పులి అని... పచ్చి అబద్ధాల కోరు అని ధ్వజమెత్తారు. తక్కువ సమయంలో కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో...? చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. పార్టీ గెలిస్తే ఏడ్చి.. ఓడితే నవ్వే వారని దుయ్యబట్టారు. ఈటల తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారన్నారు. తన అసంతృప్తిని మంత్రులు, ఎమ్మెల్యేలందరిపై రుద్దుతున్నారని.. కేసీఆర్ నాయకత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ముదిరాజ్ల కోసం ఎన్నడూ పట్టించుకోని ఈటలకు... పదవి పోగానే బీసీలు గుర్తుకొస్తున్నారని దుయ్యబట్టారు. తాను ప్రాతనిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పార్టీ నేతలను బయటకు పంపే కుట్ర చేశారన్నారు.
స్వయంగా ఒప్పుకున్నారు..
ప్రభుత్వంపై, సీఎంపై ఈటల విమర్శలు చేయడం శోచనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తనకు గౌరవం దక్కలేదని పేర్కొనడం అబద్ధమని.. మొదటి నుంచి ఈటలకు పార్టీలో, ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత లభించిందన్నారు. తెరాసతో ఈటల అనేక విధాలుగా లబ్ధి పొందారన్నారు. వ్యాపార అభివృద్ధి కోసం అసైన్డ్ భూములు కొన్నట్లు స్వయంగా ఈటలనే అంగీకరించారన్నారు. నాలుగేళ్లుగా అసంతృప్తితో ఉన్న ఈటల.. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
ఏదడిగినా కదనలేదు...
తనకు రాజకీయ జీవితాన్ని కల్పించిన కేసీఆర్నే ఈటల రాజేందర్ సవాల్ చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. శాసనసభపక్ష నేతగా ఈటలకు కేసీఆర్... అత్యున్నత స్థానాన్ని కూడా కల్పించారని గుర్తు చేశారు. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న కమలాపూర్ నియోజకవర్గాన్ని ఈటలకు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చారన్నారు. ఈటల నియోజకవర్గానికి ఏది అడిగినా... సీఎం కాదనలేదన్నారు. రాజకీయాల్లో ఉంటూ ప్రభుత్వ భూముల జోలికి పోవద్దన్నారు. ఈటల తరచూ మాట్లాడిన మాటలు బాధ కలిగించాయన్న వినోద్... ఓ మంత్రిపై మాట్లాడటం సరైంది కాదని ఊరుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.