రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్తున్న తెరాసకు... దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇదే విషయం నిన్నటి నుంచి తెరాస వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దుబ్బాకలో చేదు ఫలితాన్ని అనేక అంశాలు ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. అనేక ఎన్నికల్లో ఘనవిజయాలే నమోదవుతుండటం వల్ల... దుబ్బాకలోనూ అదే పునరావృతమవుతుందన్ని ధీమాతో బరిలో దిగింది. ఉప ఎన్నిక కాబట్టి అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చని మొదట్లో అంచనా వేసింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలోకి దించితే సానుభూతి కూడా కలిసొస్తుందని భావించింది.
అంతా తానైన హరీశ్..
కేసీఆర్, హరీశ్ రావు నియోజకవర్గాల పక్కనే ఉన్న దుబ్బాకలోనూ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఘన విజయాలే సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలను కొంత తక్కువ అంచనా వేయడం వల్ల దెబ్బతగిలినట్టు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసంతృప్తిగా ఉన్న కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటీముట్టనట్టుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థి సుజాత అనుభవ రాహిత్యం కూడా ఓటమికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన హరీశ్ రావు తానే అభ్యర్థినన్నట్టు విస్తృతంగా ప్రచారం చేసిప్పటికీ ఫలితం లేకపోయింది.
గుర్తును పోలిన గుర్తు
సామాజిక మాధ్యమాల్లో భాజపా విస్తృతంగా చేసిన ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేక పోయినట్టు పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఆశించిన ఓట్లు రాకపోవడం కూడా దుబ్బాకలో తెరాస ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ కూడా కొంప ముంచినట్టు తెరాస భావిస్తోంది. చపాతీ రోలర్ గుర్తుతో బరిలో ఉన్న నాగరాజు 3, 750 ఓట్లతో భాజపా, తెరాస, కాంగ్రెస్ తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. కారు గుర్తుకు వేయబోయి కొందరు నాగరాజుకు ఓటేసినట్టు స్పష్టమవుతోంది. మెజార్టీ తగ్గినప్పటికీ కచ్చితంగా గెలుపు తమదేనని తెరాస భావించినప్పటికీ... పక్కనే ఉన్న గజ్వేల్, సిద్ధిపేటలో జరిగినంత అభివృద్ధి దుబ్బాకలో జరగలేదన్న విపక్షాల ప్రచారం ఓటర్లను ప్రభావం చేసినట్టు అర్దమవుతోంది.
అంచనా లోపం!
భాజపా అభ్యర్థి రఘునందన్ రావు గతంలో రెండు సార్లు ఓడిపోవడం ఆయన పట్ల సానుభూతిని పెంచినట్టు తెరాస శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. చెరుకు శ్రీనివాసరెడ్డి సరిగ్గా ఎన్నికల సమయంలో తెరాస నుంచి కాంగ్రెస్లో చేరి బరిలో నిలవడం పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ... అది కూడా పార్టీకి కొంత కారణంగా అంచనా వేస్తున్నారు. విజయంపై కొంత అతి విశ్వాసం, ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయడం కూడా తెరాసను దెబ్బతీసినట్టు అభిప్రాయపడుతున్నారు. భాజపా, కాంగ్రెస్ తరఫున జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ తెరాస తరఫున జిల్లా మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే ప్రచారం చేశారు. గెలుపుపై ధీమాతోనే ఇతర మంత్రులు, రాష్ట్రస్థాయి నాయకులెవరినీ ప్రచారానికి పంపలేదని తెలుస్తోంది.
ఇదీ చూడండి: దుబ్బాక ఓటమితో తెరాసలో అంతర్మథనం