ధరణి ద్వారా మంచి సేవలు అందించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ తెలిపింది. రైతులకు, ప్రజలకు ఏక కాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలు సత్వరంగా, పారదర్శకంగా అందించేలా ధరణి పోర్టల్... రెవెన్యూ శాఖలో సాంకేతిక విప్లవం సృష్టిస్తుందని ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్ అన్నారు.
ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన ట్రాసా బృందం శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖ పని తీరు, ప్రతిష్ఠను పెంచేలా సీఎం మాట్లాడడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం అమలుకు, ప్రజా సంక్షేమం కొరకు రెవెన్యూ ఉద్యోగులంతా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.
ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్, పట్టా మార్పిడి, విరాసత్, దాన పత్రం, భాగ పంపిణీ తదితర సేవలను పారదర్శకంగా అందిస్తామని వివరించారు. తహసీల్దార్ కార్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.