Trains cancelled due to Jawad Cyclone : జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపు బయలుదేరాల్సిన భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17015), పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్(17479), పలాస -విశాఖపట్నం (18531), కిరండోల్- విశాఖపట్నం(18552), తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్(20890), భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్(22819), భువనేశ్వర్ -తిరుపతి ఎక్స్‌ప్రెస్(22871), హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్(12663), భువనేశ్వర్ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12845) రైళ్లు రద్దు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది.
తప్పిన 'జవాద్' ముప్పు..
ఉత్తరాంధ్రకు జవాద్ తుపాను ముప్పు తప్పింది. శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను బలహీనపడినా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాలపూర్ ఐఎండీ అధికారి ఉమాశంకర్‌దాస్ తెలిపారు. తుపాను బలహీనపడినా దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సంచాలకులు సునంద వెల్లడించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని చోట్ల గాలులు బలంగా వీస్తాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉందని చెప్పారు.
కొబ్బరిచెట్టు కూలి యువతి దుర్మరణం...
తుపాను గాలులకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరిచెట్టు కూలి పడి ఓ యువతి మృతి చెందింది. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం మెళియాపుట్టికి చెందిన గొరకల చంద్రయ్య కుటుంబం కొబ్బరితోటలోనే నివాసం ఉంటుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న వీరి రెండో కుమార్తె ఇందు (17)పై శనివారం ఉదయం కొబ్బరిచెట్టు కూలిపడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
ఇదీ చదవండి: Jawad Cyclone: బలహీనపడుతున్న జవాద్.. ఒడిశాకు తప్పిన ముప్పు!