మొహర్రం సందర్భంగా భాగ్యనగరంలో రేపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు జరగనుంది. డబీర్‌పురాలోని బీబీ కా ఆలం నుంచి ఊరేగింపు ప్రారంభమై.. చాదర్‌ఘాట్ వరకు సాగనుంది.
మహ్మద్ ప్రవక్త కుటుంబం చేసిన త్యాగాలను స్మరించుకోవడమే ‘మొహర్రం’ అని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. నగరంలో జరిగే మొహర్రం సన్నాహాలపై ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. అదనపు పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు) డీఎస్.చౌహాన్, వెస్ట్‌జోన్ సంయుక్త కమిషర్లు ఎ.ఆర్.శ్రీనివాస్, విశ్వప్రసాద్, ఎం.రమేశ్, గజరావు భూపాల్, కల్మేశ్వర్ శింగనేవార్, వివిధ ఠాణాల అధికారులు పాల్గొన్నారు. మొహర్రం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కమిషనర్ ఆయా అధికారులకు వివరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
మొహర్రం సందర్భంగా.. కరోనా నిబంధనల ఉల్లంఘన జరిగే అవకాశముందని సీపీ అంజనీకుమార్ అన్నారు. ప్రజలెవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులదేనని చెప్పారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పండుగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.