Revanth Reddy Comments: రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యలన్నింటి వెనుక ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్ని పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యలో 300 మంది పార్టీలో చేరారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస్‌లో చేరుతున్న కార్యకర్తలను.. పార్టీ కండువా కప్పి స్వాగతించారు.
గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు.. ఆయన గెలిచిన తర్వాత అభివృద్దిపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడంతో విసిగి కాంగ్రెస్ వైపు వస్తున్నారని రేవంత్ తెలిపారు. రైతు సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయకపోగా.. రాజకీయ ప్రయోజనాల కోసం కొనుగోలు సమస్యను ముందుకు తెచ్చారని విమర్శించారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు.
"రైతుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల బదీలీల్లో నెలకొన్న ఆందోళన కావచ్చు. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలకు భాజపా, తెరాసలే కారణం. వడ్ల కొనుగోళ్ల విషయంలో సమస్యను పరిష్కరించకుండా.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు సమస్యను పక్కదారి పట్టించారు. ఇప్పుడు ఉద్యోగుల బదిలీల విషయంలో 317 జీవో రద్దు చేయకుండా.. రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యలన్నింటి వెనక మోదీ, కేసీఆర్ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్ని పరిష్కారం కావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే జరుగుతాయి. అందుకోసం కార్యకర్తలంతా నిరంతరం కష్టపడాలి." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: Revanth Reddy : 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా'