Revanth Reddy independence day wishes: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వందల సంవత్సరాల బ్రిటిష్ పాలకుల ఆధిపత్య పాలనను ఎదిరించి.. దేశ ప్రజల బానిస సంకెళ్లను తెంచి స్వరాజ్యాన్ని స్థాపించి ప్రజలకు స్వేచ్ఛ వాయువులను అందించించిన స్వాతంత్య్ర సమరయోధులకు వందనాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం.. వీరుల త్యాగమే నేటి మన స్వాతంత్య్రం అని రేవంత్‌రెడ్డి అన్నారు.
వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక, సేవ రంగాలలో భారత్‌ని అగ్రగామిగా నిలిపిన ఘనత కాంగ్రెస్ పాలకులదని పేర్కొన్నారు. భాజపా పాలకులు దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మోతిలాల్ నెహ్రు, మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్ధార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, రవీంద్రనాథ్ ఠాగూర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, పింగళి వెంకయ్య లాంటి ఎందరో మహానుభావుల శ్రమ, పోరాటం, త్యాగ ఫలితమే మన స్వాతంత్య్ర దేశమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ పాలకులు హరిత విప్లవం, శ్వేత విప్లవం, పారిశ్రామిక విప్లవం, పంచవర్ష ప్రణాళికలు, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఐ.టి రంగంలో విప్లవం, టెలిఫోన్ రంగం, విద్యుత్ రంగం, విద్య, వైద్య, రోడ్లు, గ్రామాల అభివృద్ధి ఇలా దేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు 20 సూత్రాల పథకం అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేశారన్నారు. గరీభీ హఠావో అంటూ పేదలను కాంగ్రెస్ అభివృద్ధి పథంలో నడిపించిందన్నారు. అలాంటి దేశం నేడు మత ప్రాతిపదికగా చేదిరిపోతుందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య పోరాటంలో ఏ మాత్రం పాలు పంచుకొని కొన్ని శక్తులు నేడు దేశాన్ని మత ప్రాతిపదికగా చీల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను వారి తాబేదార్లకు ఇచ్చి ప్రజా ఆస్తులను కొందరికి కట్ట బెడుతున్నారని పేర్కొన్నారు. దేశం, ధర్మం అనే మాటలతో మభ్య పెడుతూ ప్రజలను పెడుతూ మోసం చేస్తున్నారని... రాజకీయ లబ్ధి కోసం జనాల మధ్య చిచ్చు పెడుతున్నారని రేవంత్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: