హైదరాబాద్‌లో కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ కార్యకర్తలను గాంధీ భవన్ బయటకు రాకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించ తలపెట్టిన తిరంగ ర్యాలీని పోలీసులు అడ్డుకుంటే గాంధీభవన్‌లో ఒక రోజు దీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
రాజ్యాంగాన్ని రక్షించండి: కాంగ్రెస్
గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంకు బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు రాజ్యాంగాన్ని రక్షించండి పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్.. పోలీసుల అనుమతి కోరింది. దీనికి వారు నిరాకరించడం వల్ల డీజీపీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. అయినా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అజ్ఞాతంలో హస్తం నేతలు
కాంగ్రెస్ చేపట్టనున్న ర్యాలీలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల.. పోలీసు శాఖ అప్రమతమైంది. ముందస్తు అరెస్ట్‌లు, గృహనిర్బంధాలను ముందే ఊహిచిన హస్తం నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రతి డివిజన్ నుంచి వంద నుంచి 150 మంది ర్యాలీలో పాల్గొనేందుకు రావాలని కార్యకర్తలను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ కోరారు.
గేటు దాటితే.. అరెస్టే..
గాంధీభవన్ రెండు ద్వారాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రోడ్డుమీదకు వస్తే తక్షణమే అరెస్ట్ చేసి తరలించేందుకు అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచారు. గాంధీ భవన్ నుంచి లోయర్ ట్యాంకు బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు దారి వెంట పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో "కల్వకుంట్ల పోలీసు సర్వీస్" నడుస్తోంది: కాంగ్రెస్