కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల కనీస ప్రాథమిక బాధ్యతన్నారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఉత్తమ్ విమర్శించారు. కొవిడ్ బాధితులు.. సరైన వైద్యం అందక అవస్థలు పడడం అత్యంత బాధాకరమన్నారు. ఆస్పత్రుల్లో పడకలు దొరక్క, ఆక్సిజన్, వెంటిలేటర్స్, మందుల కొరతతో రోగుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు.
కరోనా బారినపడి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్న ఉత్తమ్.. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతానని చెప్పారు. కరోనా బాధితుల కోసం గాంధీ భవన్లోపాటు రాష్ట్రవ్యాప్తంగా కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి సేవలందిస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఆయన అభినందించారు.
ఇవీచూడండి: అమ్మో.. నాకు.. కరోనా వస్తుందేమో..!