అమెరికా పర్యాటక వీసాల(American Tourist Visas from December)ను డిసెంబరు నుంచి జారీచేయనున్నట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో వీసా వ్యవహారాలను పర్యవేక్షించే మినిస్టర్ కౌన్సెలర్ డాన్ హెఫ్లిన్ తెలిపారు. డిసెంబరు మొదటి వారం నుంచి ఈ వీసాలకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. అమెరికా వెళ్లేందుకు ఉన్న ఆంక్షలను గత సోమవారం నుంచి పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో వీసా వ్యవహారాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు బుధవారం ఆయన ఫేస్‌బుక్ ద్వారా సమాధానాలు ఇచ్చారు. ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదించిన, అధికారిక గుర్తింపు పొందిన అన్ని టీకాలతో పాటు కొన్ని దేశాల్లో అత్యవసర వినియోగంలో భాగంగా అనుమతించిన టీకాలు(రెండు డోసులు) వేసుకున్న వారికి అమెరికా వెళ్లేందుకు అనుమతి ఉంది’’ అని డాన్ హెఫ్లిన్ స్పష్టం చేశారు.
కరోనా నెగిటివ్ ధ్రువపత్రం తప్పనిసరి
రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన సర్టిఫికెట్(Corona vaccination certificate)తో పాటు ప్రయాణానికి మూడు రోజుల ముందు నుంచి కొవిడ్ బారిన పడలేదని నిర్ధారించే ధ్రువీకరణ అవసరం. కొవిడ్ నెగిటివ్ ధ్రువపత్రాన్ని బోర్డింగ్‌కి ముందే విమానాశ్రయంలో చూపించాలి. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్న వారు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
వీసాల కోసం ఫీజులు చెల్లించిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కరోనా సమయంలో ఫీజు చెల్లించినా.. వీసా ఇంటర్వ్యూకు హాజరుకాని వారికి.. 2023 సెప్టెంబరు 30 వరకు ఆ ఫీజు చెల్లుబాటయ్యేలా పొడిగింపు ఇచ్చాం.
వీసా పునరుద్ధరించుకు(Visa renewal)నే వారు డ్రాప్‌బాక్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. దిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల్లో ఈ సేవలు పొందవచ్చు. ప్రస్తుతం డ్రాప్‌బాక్స్ అపాయింట్‌మెంట్లు తక్కువగా అనుమతిస్తున్నాం. కాన్సుల్ కార్యాలయాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కాన్సులేట్ కార్యాలయ వెబ్‌సైట్‌లలోనూ ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది.
తొలి డోసు అమెరికాలో.. ఇప్పుడు భారత్‌లో రెండో డోసు ఎలా?
‘అమెరికాలో ఉన్న సమయంలో ఫైజర్ తొలిడోసు తీసుకున్నా. ఆ తరువాత దిల్లీ వచ్చి ఉండిపోయా. రెండో డోసు తీసుకోలేకపోయా. ఇప్పుడు అమెరికా వెళ్లటం ఎలా’ అన్న ప్రశ్నకు హెఫ్లిన్ సమాధానం ఇస్తూ.. 'మరో వ్యాక్సిన్ ఏదైనా రెండో డోసుగా తీసుకోవచ్చేమో నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. అదీ గుర్తింపు పొందిన టీకా అయి ఉండాలి. టీకా ధ్రువీకరణ పత్రాన్ని వీసా దరఖాస్తు సమయంలోనే చూపించాలి. ఆధార్ సంఖ్య ఉంటే సంపూర్ణ వ్యాక్సినేషన్ అయిందా? లేదా? తెలుస్తుంది.' అని చెప్పారు.