TTD Special Darshan Tickets : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్య వల్ల టికెట్లు విడుదల చేసినా... భక్తులు బుకింగ్ చేసుకోలేకపోతున్నారు. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య పరిష్కారానికి తితిదే ప్రయత్నం చేస్తోంది. ఉదయం 9 గంటలకు టికెట్లు విడుదల చేయగానే వచ్చిన సమస్య... 12 గంటల కల్లా పరిష్కరిస్తామని తి.తి.దే వెల్లడించింది. ఆ తర్వాత భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చునని తెలిపింది.
రేపటి నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటితో పాటు మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కూడా రోజుకు 25 వేల చొప్పున విడుదలయ్యాయి. మరోవైపు సర్వదర్శనం టికెట్లను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు అదనంగా 5వేల చొప్పున తిరుపతిలోని కౌంటర్ల ద్వారా భక్తులకు అందిస్తున్నారు.
ఇప్పటి వరకు రోజుకు 15వేల సర్వదర్శన టికెట్లు ఇస్తుండగా.. మార్చి నెల నుంచి రోజుకు 20 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో ప్రకటిత రోజుల్లో అందజేయనున్నట్లు తితిదే వెల్లడించింది. ఇక తిరుపతి కౌంటర్లలో రోజుకు 20 వేల చొప్పున జారీ చేస్తున్న సర్వదర్శన టికెట్లను... భక్తులు నేరుగా తీసుకునే వెసులుబాటు ఉంది.
ఇదీ చదవండి: Yadadri Moolamantra Yagam : యాదాద్రిలో మహాయాగానికి బదులు మూలమంత్ర యాగం