తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు(TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU) సర్వం సిద్ధమైంది. ఉత్సవాలకు అంకురార్పణగా స్వామివారి సేనాధిపతి విశ్వక్ష్సేనులవారు తిరుచ్చిపై ఊరేగుతూ... ఏర్పాట్లను పరిశీలిస్తారు. అర్చకులు పుట్టమన్ను, నవ ధాన్యాలు సేకరించి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం ముక్కోటి దేవతల్ని వేడుకలకు ఆహ్వానిస్తూ.. గరుడ పటాన్ని ఎగురవేస్తారు. దీనికోసం ఉపయోగించే దర్భను శేషాచల అటవీ ప్రాంతం నుంచి సేకరించి చాప, తాడు తయారు చేయించి శ్రీవారి ఆలయానికి చేర్చారు.
15న చక్రస్నానం
గురువారం రాత్రి పెద్దశేషవాహనంతో సప్తగిరీశుడి వాహనసేవలు ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజులపాటు వివిధ వాహనాలపై అభయప్రదానం చేయనున్న స్వామివారికి... 15న చక్రస్నానం నిర్వహిస్తారు. కరోనా ప్రభావంతో వాహన సేవలన్నీ ఆలయంలోని రంగనాయకుల మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గరుడవాహన సేవనాడు ప్రభుత్వం తరఫున స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేరోజు తిరుగిరులపై కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
బ్రహ్మోత్సవాలు నిర్వహించే తొమ్మిది రోజుల పాటూ ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. బక్తులకు మాడవీధుల్లో శ్రీవారి వాహన సేవల దర్శన భాగ్యం ఉండదు. తితిదే ఎస్వీబీసీ ఛానల్‌లో ఉత్సవాలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నా... శ్రీవారి మూలమూర్తిని భక్తులు దర్శించుకొనేలా ఏర్పాట్లు చేసింది. అయితే కరోనా ప్రభావంతో దర్శన టికెట్లను పరిమిత సంఖ్యలో జారీచేశారు. రోజుకు 8 వేల చొప్పున చొప్పున ప్రత్యేక, సర్వదర్శనం టోకెన్లు జారీ చేశారు. బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం 6నుంచి 7గంటల మధ్య అంకురార్పణ చేస్తారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల విద్యుత్ శోభతో వెలుగులీనుతోంది. ప్రధాన ప్రదేశాల్లో అలంకరణలు చేపట్టారు.
ఇదీ చదవండి : ఎంగిలి పూలతో బతుకమ్మకు స్వాగతం.. తెలంగాణలో ప్రతి ఇంటా కోలాహలం