తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతివారిని ఆలయంలోని రంగనాయకుల మండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత పవిత్రమండపంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు అర్చకులు శాత్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వరణంలో శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఉత్సవ నిర్వహణ బాధ్యతను భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు కేటాయించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962 వ సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ఉత్సవాలను 3రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరిరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయక మండపంలో వేంచేపు చేస్తారు.
దోష నివారణ ఉత్సవాలు..
పవిత్రోత్సవాలను 'దోష నివారణ', 'సర్వయజ్ఞ ఫలప్రద', 'సర్వదోషోపశమన', 'సర్వతుష్టికర', 'సర్వకామప్రద' తదితర పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచుతారు. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారంగానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.